Author: వర్మ
•8:02 AM
  • ఇంటిపై ఓంకార చిహ్నము.
  • ఇంటిపై కాషాయ ధ్వజము.
  • ఇంటి వాకిట్లో తులసి.
  • ఇంటిలో మహనీయుల, దేవతల, భరతమాత చిత్రపటములు.
  • ఇల్లు, ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు
  • ఇంటిలో శుభ్రమైన త్రాగునీటి వ్యవస్థ, మురుగు నీరు పోవుటకు వ్యవస్థ
  • ఇంటి ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు మరియు వేప, కానుగ వంటి నీడనిచ్చు మొక్కల పెంపకం
  • ఇంటిలోని వారంతా ప్రాత:కాలమే లేచుట, వెంటనే కాలకత్యాలు తీర్చుకొనుట.
  • ప్రతినిత్యం స్నానం, కుంకుమధారణ, దేవునికి నమస్కరించుట.
  • కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసికొనుట.
  • పిన్నలు తమ ఇంటిలోని పెద్దలకు, తల్లిదండ్రులకు పాదాభివందనం చేయుట.
  • భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట.
  • ఇంటివారంతా కనీసం ఒకపూట కలసి భుజించుట.
  • ఇంటివారంతా ఆత్మీయంగా కలసిమెలసి ఉండుట.
  • ఇంటిలో అతిధి మర్యాదలను పాటించుట.
  • కుటుంబ వాతావరణం సంస్కార ప్రదంగా ఉండుట.
  • హిందూ పద్దతిలో పండగలు జరుపుకొనుట.
  • ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండుట.
  • ఇంట్లోని వారంతా సమరసతను పాటించుట.
  • ఇంట్లోని బాల బాలికలు, యువతీ యువకులు విద్యార్జన చేయుట.
  • మాతృభాషను, సంస్కతమును అభ్యసించుట.
  • ఇంటిలో రామాయణ, భారత, భాగవత, భగవద్గీత మొదలగు గ్రంథములను పఠించే వ్యవస్థ
  • ఇంటిలో టెలివిజన్, టేపురికార్డర్ ల వాడకముపై అదుపు.
  • ఇంటిలో స్వదేశీ వస్తువులనే వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండుట.
  • ఇంటిలో మితవ్యయమును పాటించుట.
  • ధర్మకార్యక్రమాల కొరకు ఖర్చు చేయుట.
  • పర్యావరణ సంరక్షణపై దృష్టి వుంచుట.
  • ఇంటిలోని వారంతా పొగాకు, మద్యపానము, జూదము మొదలగు దుర్వ్యసనాలకు దూరముగా ఉండుట.
  • ఇంటి వారంతా సమాజ హిత కార్యములో పాల్గొనుట.
  • సంఘ విద్రోహులను అదుపు చేయుట.
.....................................................................................................................................................
Author: వర్మ
•5:16 AM
( పిల్లలకు సరదా కోసం మా పాఠశాలలో చెప్పే కొన్ని గేయాలను ఇక్కడ ఉంచాను)
బుజ్జిపాప . . . .
బుజ్జిపాప బుజ్జిపాప ఏడికెల్తివి
అక్కతోటి నేను కూడ బడికి వెళ్తిని
బడికి వెళ్తె అయ్యగారు ఏమి చెప్పిరి ?
కూర్చోబెట్టి పలకా బలపం చేతికిచ్చిరి
పలకా బలపం చేతికిస్తె ఏమిచేస్తివి ?
ముచ్చటగా ’అ ఆ ’ లు వ్రాసి ఇస్తిని
అఆలు చూసి అయ్యవారు ఏమి అంటిరి ?
గుడ్ గుడ్ గుడ్ అంటూ మెచ్చుకుంటిరి

ఏ ఊరు
దోమ దోమ ఏ ఊరు ?
మురికి గుంట మా వూరు
ఈగ .... ఈగ ఏ ఊరు ?
చెత్తకుండి మా ఊరు
నల్లి . . నల్లి ఏ ఊరు ?
కుక్కి మంచం మా ఊరు
పురుగు పురుగు ఏ ఊరు ?
పేడదిబ్బ మా ఊరు

వంకాయ్ బాంబు
వంకాయ్ బాంబు పేలింది
వంటింట్లో అమ్మ వణికింది
వండిన కూర ఒలికింది
వదినను నన్ను తిట్టింది.

మచిలీ కా బచ్చా
మచిలీ కా బచ్చా
అండే సే నికలా
పానీ మె ఫిసలా
భయ్యా నే పకడా
అబ్బానే కాటా
అమ్మీనే పకాయా
హం సబ్నే ఖాయా
బడా మజా ఆయా

భలే భలే తిప్పడు
భలే భలే తిప్పడు
బొంగరాల తిప్పడు

అప్పులెన్నొ చేస్తడు
అప్పడాలు తింటడు

బోడిగుండు తిప్పడు
బడిని మాత్రం ఎరుగడు

తిండిపోతు తిప్పడు
తిండి మాత్రం తప్పడు
Author: వర్మ
•3:35 AM
ఒక విద్యార్థికి ఉపాధ్యాముడు ’ఎలక్ట్రిసిటి’ అనే పదం నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు. వారి మద్య సంభాషణ ఇలా ఉంది.
ఉపాద్యాయుడు : ’ఎలక్ట్రిసిటి’ అనరా రాము
రాము : ’ఎలక్ట్రికిటి’
ఉపాద్యాయుడు : ఎలక్ట్రికిటి కాదు ఎలక్ట్రిసిటి
రాము : ఎలక్ట్రికిటి
ఉపాద్యాయుడు : కిటి కాదు ’సిటి’ ’సిటి’
రాము : ’కిటి’ ’కిటి’

ఉపాద్యాయుడు రాముకు ఆ పదం నేర్పడం కష్టమనుకుని రాము వాళ్ళ తండ్రిని కలిసి విషయం వివరించాడు. అప్పుడు. .

రాము తండ్రి
: వాడికి ఆ పదం రాకపోతే వదిలేయండి సార్ దీనిని మీరు ’పబ్లికిటి’ చేయకండి.
ఇతనికి కూడా ’సిటి’ అని పలకటం రాదా అనుకుని రాము వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు.
ఉపాద్యాయుడు : ఏంటండి మీ కొడుకేమో ’పబ్లిసిటి’ ని ’పబ్లికిటి’ అంటున్నాడు మీ మనవడేమో ’ఎలక్ట్రిసిటి’ ని ’ఎలక్ట్రికిటి’ అంటున్నాడు. ఏం చేద్దామంటారు ?
రాము తాత : ఇంత చిన్న విషయానికి నా వరకు రావాలా సర్ అది వాళ్ళ ’కెపాకిటి’ సర్
ఉపాద్యాయుడు : ఆ ఆ ఆ ????????


-------------------------------------------------------------------------------------------------

ఉపాద్యాయుడు : అరె రాజేష్ నెమలి ని ఇంగ్లీషు లో ఏమంటారో చెప్పు
రాజేష్ : నాకు తెలియదు సర్
ఉపాద్యాయుడు : ఇంత చిన్న విషయం తెలియదా ఉండు నీ పని చెప్తా ..
అని ఉపాద్యాయుడు రాజేష్ జుట్టు పీకసాగాడు అప్పుడు ...
రాజేష్ : పీకక్ సర్, పీకక్ సర్
ఉపాద్యాయుడు peacock అనుకుని
ఉపాద్యాయుడు : ఆ వెరీగుడ్ .. కూర్చో
రాజేష్ : !!!!!!!!!!!
Author: వర్మ
•9:39 AM
ఒక కుక్క రొట్టెముక్క నోటితో కరుచుకుని పోతూవుంది. దారిలో ఓ వాగు అడ్డం వచ్చింది. నీళ్ళు లోతుగా లేనందువల్ల కుక్క జాగ్రత్తగా వాగు దాటసాగింది. కుక్కకు నీటిలో తన ప్రతిబంబం కనబడింది.

కుక్క తనలో తాను ఇలా అనుకుంది - ’’ నీళ్ళలో మరో కుక్క రొట్టె ముక్క తీసుకొని పోతూ ఉంది. నేను దాన్ని కాస్తా లాక్కుంటే, పెద్దరొట్టెను ఎంచక్కా తినొచ్చు. ’’

నీళ్ళలో కనబడే కుక్క నోట్లోనుంచి రొట్టెముక్క లాక్కోవాలని కుక్క నోరు తెరిచింది. అప్పుడు దాని నోట్లో వున్న రొట్టె ముక్క కాస్తా నీళ్ళలో పడి కొట్టుకు పోయింది. కుక్క తెల్లమొగం వేసింది.


నీతి : దురాశపడితే వున్నది కూడా పోతుంది.
Author: వర్మ
•8:12 AM
సమస్త చరాచరప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ఓసారి మానవున్ని తన వద్దకు పిలిచి ’నీకేమి కావాలి ?’ అని అడిగాడు.

మానవుడు ఇలా బదులిచ్చాడు - ’నేను బాగా పైకి రావాలి సుఖశాంతులతో తులతూగాలి, లోకమంతా నన్ను పొగడాలి’.

బ్రహ్మదేవుడు మానవుని ముందు రెండు సంచులు వుంచాడు. ఇలా అన్నాడు - ’ ఈ రెండు సంచుల్ని తీసుకో, ఒక సంచిలో పొరుగువాని తప్పులున్నాయి. దాన్ని వీపు మీద వేసుకో. దాన్ని ఎప్పుడు విప్పకుండా ఉండాలి, నీవు చూడకూడదు, ఇతరులకు చూపించకూడదు. రెండో సంచిలో నీ తప్పులున్నాయి. దాన్ని నీ ఎదుట వేలాడ తీసుకుని వుంచు. దాన్ని పదే పదే విప్పి చూస్తూ ఉండు.’

మానవుడు రెండు సంచులను తీసుకున్నాడు. కాని అతడు ఓ పొరపాటు చేసాడు. తన తప్పులున్న సంచిని వీపు మీదికి ఎత్తుకున్నాడు. దాని మూతిని గట్టిగా బిగించి ఉంచాడు. పొరుగు మనిషి తప్పులున్న సంచిని ఎదురుగుండా వేలాడదీసాడు. అప్పుడప్పడు దాని మూత విప్పి చూస్తూ ఇతరులకు చూపిస్తూ ఉండేవాడు. దీని వల్ల జరిగింది ఏమిటంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తలకిందులయింది. అతనికి సుఖశాంతులు లభించకపోగా దు:ఖం, అశాంతి ఎక్కువ కాసాగాయి. లోకులు అతన్ని దూషించసాగారు.


ప్రతి మనిషి తన తప్పులు దిద్దుకోవాలి. అప్పుడే అతను పైకి వస్తాడు. అతనికి సుఖశాంతులు లభిస్తాయి. ప్రజలు అతన్ని మనసారా ప్రశంసిస్తారు. నీవు ఇరుగుపొరుగు వారి తప్పులను వేలెత్తి చూపడం మానుకో. నీ తప్పులను తెలుసుకొని దిద్దుకోవడం నేర్చుకో.


నీతి : తమ తప్పులను దిద్దుకునే వాళ్ళే ఉత్తములు.