"అరె మన సార్లకు ఏమయిందిరా ? జీతాలు సరిపోతలేవటనా ? ఇట్ల రోడ్లమీద తిరుగుతున్నరు. " అని తన స్నేహితునితో ఒక యువకుని ప్రశ్న ...
" ఏమో తెలువదిరా మొన్నటినుండి సమ్మె జేస్తుండ్రు. ఈ మద్యనే పేపర్లో టీచర్ల జీతాలు పెరిగినయని రాసిండ్రు అయినా ఎందుకు సమ్మె జేస్తుండ్రో .... " అని స్నేహితుని సమాధానం.
అయితే టీచర్లు సమ్మె చేస్తున్నది జీతాలకొరకు కాదని , తమకు ఇంతకుముందే ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే సమ్మె చేస్తున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ బ్లాగు ద్వారా మిత్రులందరికి సమ్మె కారణాలను వివరించదలుచుకున్నాను....
ఉపాధ్యాయుల ప్రధానమయిన డిమాండ్లు మూడు ..... అవి .....
౧) ఉమ్మడి సర్వీసు నిభందనలు : ఇది చాలా ప్రధానమయిన డిమాండు. ఇది లేకపోవడం వలన విద్యా శాఖలో పెద్ద అనిశ్చితి నెలకొంది. అంటే ఎవరు ఎవరికి బాస్ అవుతారో కూడా తెలియని అనిశ్చితి ఉంది. ఈ రూల్స్ లేకపోవడం వలన బదిలీలు, ప్రమోషన్లు లేక ఎక్కడ ఉపాధ్యాయులు అక్కడే నిలిచిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఖచ్చితమయిన డి.ఇ.ఓ లు, ఎం.ఇ.ఓ లు లేక ఇన్ చార్జ్ లతో సాగిపోతున్నవి. రిటైరైన ఉపాధ్యాయుల స్థానాల్లో కొత్తవారు నియమింపబడక పోవటం వలన ఆ స్థానాలు ఖాళీగా ఉండి విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. అయితే ఉమ్మడి సర్వీసు నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ పై ఆధారపడి ఉన్నది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలయగ్నం కోసం, రెండు రూపాయలకు కిలో బియ్యంకోసం రాత్రికి రాత్రే జీవోలు కేంద్రం నుండి తెచ్చుకుంటున్నప్పుడు గత పది సంవత్సరాలుగా విన్నవించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఉపాధ్యాయులకు ఆగ్రహం తెప్పించింది.
౨) అప్రెంటిస్ విధానం రద్దు : అప్రెంటిస్ విధానం అంటే కొత్తగా ప్రాథమిక పాఠశాలలో చేరిన ఉపాధ్యాయుడు మొదటి సంవత్సరం 1800రూపాయలు, రెండవ సంవత్సరం 2400రూపాయలు పొందుతారు. తర్వాతి సంవత్సరంలో మాత్రమే స్కేలు(నిజమయిన జీతం) ఇస్తారు. అంటే మొదటి రెండు సంవత్సరాలు వెట్టిచాకిరి చెయ్యాలన్నమాట. ఈ విధానం సరియైనది కాదని, 1800రూపాయలతో జీవితం వెళ్ళదీయటం కష్టమని ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
౩) ఇప్పటికే అప్రెంటిస్ పీరియడ్ ను పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు అందజేయాలి. ధీనికి ఎప్పుడో ప్రభుత్వం ఒప్పుకుంది కానీ జీ.వోను తీయటంలో తాత్సారం చేస్తున్నది.
అన్నింటికన్నా ముఖ్యమైనది. సమ్మె చేసి పిల్లల్ని కష్టపెట్టడం ఉపాధ్యాయుల ముఖ్య ఉద్దేశ్యం కాదు. ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా సమ్మెలోకి దిగటం అనేది ఇరవైరెండు సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇరవైరెండు సంవత్సరాల తర్వాత సమ్మె చేయవలసిన అవసరం వచ్చింది.
ఇప్పటికయినా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల న్యాయమయిన సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేస్తారని కోరుకుందాం.......
కబుర్లు
|
3 comments:
చాలా వివరణాత్మకంగా వ్రాసారు. టీచర్లు సహేతుకమైన కారణాలతోనే సమ్మెకు పూనుకొన్నారన్న విషయం మీరన్నట్లు చాలామందికి తెలియదు. మన బ్లాగులోకంలో మిత్రులకు తెలియచేయటం ముదావహం.
అభినందనలతో
xcxcxcx
I am sorry andi.. edo chusukokunda ala vachesindi.. sorry for that